అక్టోబర్ 15 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

By :  Aruna
Update: 2023-09-19 11:21 GMT

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా దసరా ఏర్పాట్లపై తాజాగా ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇతర ఆలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి దుర్గ గుడిలో సేవలకు వినియోగిస్తామని పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. నవరాత్రుల్లో ఆలయంలో విధులు నిర్వర్తించేందకు కాంట్రాక్ట్ పద్ధతిలో మరికొంత మందిని నియమిస్తామని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనాన్ని కూడా త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

ప్రతి సంవత్సరం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కన్నులపండుగగా దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ జరిగే నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. తాజాగాదసరా ఏర్పాట్లపై జరిగిన సమావేశాల్లో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దసరా ఉత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించారు.అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 23 వరకు ఉత్సవాలు జరుగుతాయి. అక్టోబర్‌ 15 అమ్మవారు బాలా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 16 గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు అనుగ్రహిస్తారు. అక్టోబరు 17 - అన్నపూర్ణ దేవి,అక్టోబరు 18 - మహాలక్ష్మి , అక్టోబరు 19 - మహాచండీ, అక్టోబరు 20 - సరస్వతి దేవి, అక్టోబరు 21 - లలితా త్రిపుర సుందరి, అక్టోబరు 22 - దుర్గాదేవి, అక్టోబరు 23 - మహిషాసుర మర్దిని అవతారాల్లో కనకదుర్గమ్మ దర్శనం ఇవ్వనుంది.

ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ.."ఉత్సవాల సందర్భంగా కొండ కింద ఉన్న వినాయకుడి గుడి నుంచి ప్రత్యేకే క్యూలైన్లు ప్రారంభమవుతాయి. ఎప్పటిలాగే ఐదు క్యూ లైన్లు ఉండనున్నాయి. కేశ ఖండనకు 600 మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. భక్తుల కోసం ప్రత్యేకంగా షెడ్లు వేస్తున్నాం. స్నానాలకు షవర్లు ఏర్పాటు చేస్తున్నాం. భక్తుల సౌకర్యార్థం 10 ప్రసాదం కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. మోడల్‌ గెస్ట్‌హౌస్‌, స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ల దగ్గర కూడా ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. వీవీఐపీల కోసం స్పెషల్ స్లాట్లు కూడా నిర్ణయిస్తాం. దసరా ఉత్సవాల నిర్వహణకు మొత్తం రూ.7 కోట్ల బడ్జెట్ కేటాయించాం. గత ఏడాది మాదిరిగానే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఈ 9 రోజులూ అంతరాలయ దర్శనం ఉండదు". అని ఆమె మీడియాకు తెలిపారు.


Tags:    

Similar News