Fog Effect: కమ్మేసిన పొగమంచు.. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

Byline :  Veerendra Prasad
Update: 2023-12-25 06:41 GMT

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కొన్ని జిల్లాల్లో దట్టమైన పొగ మంచు కురుస్తోంది. పొగ మంచు కారణంగా రహదారులు సరిగా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్‌ జిల్లాలో పొగమంచు కారణంగా ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ కు రావాల్సిన విమానాలు టేకాఫ్ అయ్యేందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలించకపోవటంతో 3 విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు తరలించి ల్యాండింగ్‌ చేశారు. చండీగఢ్‌ నుంచి హైదరాబాద్‌, గోవా నుంచి హైదరాబాద్‌, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌ విమానాలు రావాల్సి ఉంది.

అయితే, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు వచ్చినా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. దట్టమైన పొగమంచు కారణంగా.. విమానాలు ల్యాండ్‌ కావడం సమస్యగా మారింది. దీంతో.. ఆ మూడు విమానాలను సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవరసరంగా ల్యాండ్‌ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 165 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఇక, వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత.. ఆ ప్రయాణికులను తిరిగి అదే విమానాల్లో హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికులందరూ తాము హైదరాబాద్ కు వెళ్లాల్సి రావడంతో గన్నవరంలోనే వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News