పాడేరు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.క్షతగాత్రులను మంచి ఆసుపత్రుల్లో చేర్చి, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించింది.
పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ వద్ద 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతవారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారుపాడేరు నుంచి చోడవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.