ఏపీలో కాంగ్రెస్ నేతలే లేరా..? ఆమెకు ఏపీ పగ్గాలు ఎలా ఇస్తారు..?
ఏపీలో అధికారం కోసం కాంగ్రెస్ సకల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పజెప్పనున్నారంటూ వస్తున్న వార్తలపై ఏపీ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఆ కీలక బాధ్యత ఆమెకు అప్పగించవద్దని అంటున్నారు.
షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించనున్నారన్న వార్తలపై తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడానికి వీళ్లేదని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ నాయకులే లేరా అని ప్రశ్నించిన ఆయన.. ఇతర రాష్ట్రాల వారిని పార్టీ అధ్యక్షులుగా నియమించే స్థితి ఏపీ కాంగ్రెస్ ఉందా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి పోటీ చేయనున్నట్లు హర్ష కుమార్ స్పష్టం చేశారు. జగన్‌ను గద్దె దించేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. ఫిబ్రవరి 8న తేదీన రాజమహేంద్రవరంలో దళిత సింహ గర్జన ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
వాస్తవానికి షర్మిల తాను తెలంగాణ బిడ్డనని పలు సంందర్భాల్లో ప్రకటించారు. రాజన్న బిడ్డగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ వైఎస్సాఆర్టీపీని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించిన షర్మిల.. ఆ తర్వాత బరి నుంచి తప్పుకున్నారు. గతవారం వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన ఆమె.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకు షర్మిల హస్తం గూటికి చేరినట్లు సమాచారం.