ఎట్టకేలకు వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధులు విడుదలయ్యాయి. నేడు అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద వైసీపీ సమావేశం నిర్వహించింది. సభలో సీఎం జగన్ నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత నిధులను విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.5,060.49 కోట్ల నగదును మహిళల ఖాతాల్లో బదిలీ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న 26,98,931 మంది మహిళల ఖాతాల్లోకి రూ.18,750ల నగదును జమ చేశారు.
సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..చేయూత పథకం ఎంతో మంది మహిళలను ఆదుకుందన్నారు. మహిళా దినోత్సవం ముందు రోజు అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఐదేళ్ల పాలనలో మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగినట్లు చెప్పుకొచ్చారు. నేటి నుంచి 14 రోజుల పాటు వైఎస్ఆర్ చేయూత నిధుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఏపీ సర్కార్ ఆగస్టు 12వ తేది 2020లో ప్రారంభించింది. గత మూడు విడతల్లో ఒక్కొక్క మహిళకు రూ.56,250 మేర లబ్ధి చేకూరినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో కూడా ప్రజలంతా తమకే అధికారాన్ని కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఎటువంటి లాభం ఉండదని, ప్రజల ఆశీస్సులతో వైసీపీనే అధికారంలోకి వస్తుందన్నారు.