టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు

Update: 2023-08-09 06:36 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుపై అన్నమయ్య జిల్లా ముదివీడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో కార్యకర్తలను రెచ్చగొట్టారని అభియోగాలు మోపారు. ఎఫ్ఐఆర్ లో A1గా చంద్రబాబు, A2గా దేవినేని ఉమ, A3గా అమర్నాథ్‌రెడ్డితో పాటు మరో 20 మంది టీడీపీ నేతల పేర్లు ఉన్నాయి.

ఈ నెల 4న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన యుద్ధభేరి పర్యటనలో భాగంగా పుంగనూరులో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా ఆయన పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీనిపై చిత్తూరు సీసీఎస్ కానిస్టేబుల్ ఆర్. లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబుతో పాటు చౌడేపల్లి, పులిచెర్ల మండలాలతో పాటు అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన 47 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అనంతపురానికి చెందిన మరో ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఫిర్యాదు మేరకు చల్లా బాబుతో పాటు చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గానికి సంబంధించిన 39 మందిపై కేసులు ఫైల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే పుంగనూరులో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల పోలీసులపై చేసిన దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టైనవారి సంఖ్య 74కు చేరింది. అయితే ప్రధాన సూత్రధారైన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు ఇంకా పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేసినట్లు అతడు చెప్పినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో రాశారు.

Tags:    

Similar News