తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గోవిందరాజస్వామి ఆలయ రథం వైపు మంటలు వస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఐదంతస్తుల భవనంలోని ఓ ఫ్లోర్‌లో ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. అందులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో రూ.కోట్ల విలువైన ఫొటోలు దగ్ధమైనట్లు సమాచారం. మరోవైపు భవనం ముందు ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిప్రమాదం నేపథ్యంలో మాడ వీధుల్లో రాకపోకలను నిలిపివేశారు.