తిరుమలలో చిన్నారిపై దాడి చేసింది చిరుత కాదా..?

Update: 2023-08-12 05:09 GMT

తిరుమల అలిపిరి నడక మార్గంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి లక్షిత మృతికి చిరుత కారణం కాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరుత దాడిలో చనిపోయిందని బాలిక కుటుంబసభ్యులు చెబుతుండగా.. ఫారెస్ట్ అధికారులు మాత్రం కాకపోవచ్చని అంటున్నారు. పాపను చంపి తిన్నది ఎలుగుబంటి అయి ఉండొచ్చని డీఎఫ్ఓ సతీష్ అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం కోసం రుయా హాస్పిటల్ మార్చురీకి తరలించిన పాప మృతదేహాన్ని ఆయన పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన సతీష్.. పాపపై చిరుత దాడి చేసి ఉంటే లోతైన గాయాలు అయ్యేవని, కాని చిన్నారిపై ఉన్న గాయాలు అలా లేని అన్నారు. పోస్ట్ మార్టం అనంతరం ఏ జంతువు దాడి చేసింది స్పష్టంగా తెలుస్తుందని సతీష్ చెప్పారు. టీటీడీ డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాస్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాప జుట్టు పీకేసినట్లు ఉండటం, ముఖంపైన చర్మాన్ని పూర్తిగా తినేసిన ఆనవాళ్లు కనిపిస్తుందని చెప్పారు. చిరుత పులి దాడి అలా ఉండదని అన్నారు.

శుక్రవారం రాత్రి అలిపిరి నడకదారిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి తప్పిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నెల్లూరు జిల్లాకు లక్షిత కుటుంబం రాత్రి నడక మార్గంలో తిరుమల కొండపైకి బయలు దేరింది. కాలినడకన తిరుమలకు వస్తున్న క్రమంలో రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి తప్పిపోయింది. శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభించింది. ఒంటిపై గాయాలు ఉండటంతో పాపను చిరుత చంపేసి ఉంటుందని భావించారు. పాప మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైన అనంతరం ఏ జంతువు దాడి చేసిందన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News