ఏపీలో మరో కొత్త పార్టీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఉండగా.. మరో కొత్త పార్టీ రంగంలోకి రానుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నాయకత్వంలో కొత్త పార్టీ ప్రకటనకు అంతా సిద్ధమైంది. గత సాధారణ ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనను వీడిన ఆయన.. విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సారి ఇండిపెండెంట్ గా లేదా కొత్త పార్టీ ద్వారా పోటీలో ఉంటానని గతంలో చెప్పారు. అయితే కొత్త పార్టీ వైపే సీబీఐ మాజీ జేడీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో లక్ష్మీనారాయణ కొత్త పార్టీ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పార్టీతో ఎవరెవరు కలిసి వెళ్తారు..ఈ పార్టీ వల్ల ప్రస్తుతం ఎవరికి మేలు జరుగుతుందీ..ఎవరికి నష్టం చేస్తుందనేది హాట్ టాపిక్గా మారింది. 2019 ఎన్నికల సమయంలో లక్ష్మీనారాయణ పార్టీ పెడతారని జోరుగా చర్చ నడిచింది. అయితే కొన్ని కారణలతో ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకుని.. జనసేన నుంచి పోటీ చేశారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీని వీడారు. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీ వైపు వెళ్లలేదు.
ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడడంతో కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధమైనట్లు సమాచారం. కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన వేదిక ఇప్పుడు పార్టీగా మారుతుందని తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి ఆలోచన... జేడీతో ప్రజల భేటీ నిర్వహించిన లక్ష్మీనారాయణ పలువురి మేధావుల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పార్టీలకు భిన్నంగా కొత్త లక్ష్యాలతో పార్టీ ప్రకటించేందుకు ఆయన సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. అయితే, లక్ష్మీనారాయణ ప్రకటించే పార్టీతో ఏ పార్టీకి మైనస్ అవుతుంది.. ఏ పార్టీకి ప్లస్ అవుతుందనేది ఆసక్తిగా మారింది.