నా భార్య వీడియోలు పట్టించుకోవద్దు.. మాజీ మంత్రి తమ్ముడు
టీడీపీ మాజీ మంత్రి నారాయణ తనపై కన్నేశాడంటూ ఆయన తమ్ముడి భార్య కృష్ణప్రియ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. భార్య ఇంట్లో ఉండగానే.. మరదలైన తనను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టాడని, టార్చర్ చేసేవాడు అంటూ కృష్ణప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో సంచలనం సృష్టించింది. ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో భార్య కృష్ణప్రియ కామెంట్స్‌పై ఆమె భర్త, మాజీ మంత్రి నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్పందిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
‘‘ నమస్కారం. నా పేరు పొంగూరు సుబ్రహ్మణ్యం. నా భార్య కృష్ణప్రియ పొంగూరు.. కొద్ది రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా తాను కొన్ని వీడియోలు తయారు చేసి ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆ వీడియోలు రిలీజ్ చేస్తున్నది. ఇది మాకు, మా కుటుంబం పరువుకు భంగం కలిగించేలా.. అభ్యంతరకరంగా ఉన్నాయి. నా భార్య కృష్ణప్రియ పొంగూరు.. గత కొన్ని సం.లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2017లో కృష్ణప్రియను సైక్రియాటిస్టు(డా.శేషమ్మ)కు చూపించామని, అయినా వ్యాధి నయం కాకపోవడంతో 2019లో గుంటూరులో మరో సైక్రియాటిస్టు(డా.ఫణిభూషణ్)కు చూపించాము. అయినా రికవర్ అవ్వకపోవడవతో 2020లో మానస హాస్పిటల్(డా.విరించి) తెలంగాణలో చూపించాము. అయినా వ్యాధి నయంకాకపోవడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్(డా.షబీనీ)లో చూపించాం, ఆ తర్వాత 2023 మేలో కృష్ణప్రియకు బ్రెస్ట్ క్యాన్సర్ అని వైద్యులు చెప్పారని, యశోద ఆస్పత్రిలో డాక్టర్ శ్రీకాంత్ నా భార్యకు సర్జరీ చేశారు.. తర్వాత 8 కిమో థెరపీలు చేయించమన్నారు. ఇప్పటి వరకు రెండు థెరపీలు పూర్తి చేశామని, ఇంకా నా భార్యకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. క్యాన్సర్‌కు చికిత్స కారణంగా సైక్రియాటిస్టు మందులు నిలిపివేశారు.. అందువల్ల ఆమె వీడియోలను మానవతా ధృక్పధంతో ఎవరూ పట్టించుకోవద్దు’’ అంటూ పొంగూరు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.