srisailam : మల్లన్న భక్తులకు శుభవార్త.. రాత్రి వేళల్లోనూ వాటికి అనుమతి
ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో శ్రీశైలం కూడా ఒకటి. నల్లమల అడవుల్లో కొండల మధ్య శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. పరమేశ్వరుని దివ్యధామం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ పుణ్యక్షేత్రం కూడా ఒకటి. ఈ ఆలయంలో మల్లికార్జునుడిగా, అమ్మవారు భ్రమరాంభ దేవిగా పూజలు అందుకుంటారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయం వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి సమయంలో కూడా అడవిలో వాహనాలు ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారు. దోర్నాల అటవీశాఖ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. మార్చి 1వ తేది నుంచి 11వ తేది వరకూ భక్తులు రాత్రి వేళల్లో ప్రయాణించి శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. దీంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పెద్దదోర్నాల శ్రీశలైం నల్లమల రహదారి దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. ఇది పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. కాబట్టి ఈ రహదారిలో రాకపోకలు సాగించేవారు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
సాధారణంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఈ అటవీ ప్రాంతంలో ఉన్న రోడ్డును మూసివేస్తారు. వాహనాల రాకపోకలన్నీ పెద్దదోర్నాల అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్దే నిలిపివేస్తారు. అయితే శ్రీశైలం బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని రాత్రి సమయంలో కూడా వాహనాల రాకపోకలు సాగించవచ్చని అధికారులు తెలిపారు. ఇది తాత్కాలిక సడలింపు మాత్రమేనని, బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత తిరిగి ఈ నిబంధనను అనుసరించే వాహనాలు రాకపోకలు సాగాలని అధికారులు స్పష్టం చేశారు. వన్యప్రాణులకు హాని చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.