Guntur doctors : సినిమా థియేటర్గా మారిన హాస్పిటల్.. పోకిరి సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ
డాక్టర్లు కొత్త పద్దతులు కనిపెట్టి ఆపరేషన్ చేస్తారు. కానీ ఈ డాక్టర్ చేసిన వింత ఆపరేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ రోగి ఆపరేషన్ కోసం హాస్పిటల్ థియేటర్ గా మారింది. ఆ రోగికి ఇష్టమైన పోకిరి సినిమా చూపిస్తూ.. డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఈ ఘటన జరిగింది గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో తొలిసారిగా రోగి మెలుకువతో ఉండగానే.. మెదడు ఆపరేషన్ చేసినట్లు గుంటూరు జీజీహెచ్ వైద్యలు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఐలాపురానికి చెందిన పండు (48) కాలు, చేయి బల హీనపడి అపస్మారక స్థితికి చేరాడు. జనవరి 2న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి అతని కుంటుంబ సభ్యులు తీసుకొచ్చారు.
అతన్ని పరీక్షించిన వైద్యులు.. బ్రెయిన్ లోని మోటార్ కార్టెక్స్ అనే భాగంలో ట్యూమ్ ఏర్పడినట్లు గుర్తించారు. దాన్ని తొలగించే క్రమంలో రోగి కుడికాలు చేయి చచ్చుబడే ప్రమాదం ఉంది. ఆపరేషన్ సమయంలో రోగిని మెలకువగా ఉంచి.. అతని కాళ్లు, చేతుల కదలికలు గమనించడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించొచ్చని న్యూరో డాక్టర్లు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనవరి 25న అతనికి అనస్థీషియా ఇచ్చి.. ఎవేకెన్ బ్రెయిన్ సర్జరీ చేశారు. అతనికి మహేశ్ బాబు అంటే ఇష్టం ఉండటంతో.. పోకిరి సినిమా చూపిస్తూ విజయవంతంగా ఆపరేషన్ చేశారు.