కీర్తన...నిండా 13 ఏళ్లు నిండని వయసు. తల్లి చాటున పెరుగుతున్న ఓ పసి మనసు. కానీ ఈ పాప చూపిన ధైర్యం మాత్రం గోదారంత. ప్రాణాలను రక్షించుకున్న తీరు ప్రపంచమే మెచ్చుకునేలా చేసింది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ కిరాతకుడు తన కళ్ల ముందే తల్లి, చెల్లిని గోదారిలోకి నెట్టేశాడు. కీర్తనను అదే తరహాలో బ్రిడ్జ్‌పై నుంచి నదిలోకి నెట్టేశాడు. ఈ క్రమంలో ఓక పైప్ లైన్ ఫోన్ కాల్‌తో తన ప్రాణాలను కాపాడుకున్న తీరు చిన్నారిని సాహస కీర్తనగా మార్చింది. చావు కొరల నుంచి బయటపడిన కీర్తన తల్లి, చెల్లి తన కళ్ల ముందే నదిలో కలిసిపోయిన విషాద క్షణాలను తలచుకుంటూ రోదిస్తోంది.
ఇందటి దారుణానికి పాల్పడిన ఆ కిరాతకుడికి తగిన శిక్ష వేయాలంటూ పాప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.
ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. రావులపాలెం గౌతమి పాత వంతెన వద్ద ఓ వివాహిత, ఇద్దరు పిల్లలను గోదారిలో నెట్టేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ప్రమాదం నుంచి సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది చిన్నారి కీర్తన. ఆ బాలికను పోలీసులు తెనాలిలోని ఆమె పెద్దమ్మకు అప్పజెప్పారు. ఈ క్రమంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన బాలిక తమపై జరిగిన దారునాన్ని గురించి వివరించి రోదించింది.
మీడియాతో కీర్తన మాట్లాడుతూ.. " మా ఊరు తాడేపల్లి. అమ్మ ఎంసీఏ చదివింది. కానీ కొన్ని కారణాల వల్ల ఓ హోటల్‌లో గ్రైండర్ దగ్గర పని చేస్తోంది. అక్కడే అమ్మకు సురేష్ అనే వ్యక్తి 2018లో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అతను అమ్మతోనే ఉంటున్నాడు. గత సంవత్సరమే నాకు ఓ చెల్లి పుట్టింది. ఆ తర్వాత నుంచి అతను మా అమ్మను పట్టించుకోవడం మానేశాడు. వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అతనిపై కంప్లైంట్ కూడా పెట్టాం. ఆ గొడవలు జరుగుతుండగానే ఈ నెల 5న కొత్తగా కారు కొన్నానని, సరదాగా బయటికి వెళ్లివద్దామని అమ్మకు చెప్పాడు. దంతో అందరం కలిసి అతనితో కారులో బయలుదేరాం. ఆదివారం తెల్లవారుజామున రావులపాలెం దగ్గర ఓ బ్రిడ్జ్ దగ్గర కారు ఆపాడు. అమ్మను పిలిచి సెల్ఫీ దిగుదామని చెప్పాడు. అతని మాయ మాటలు నమ్మిన అమ్మ కారు నుంచి దిగింది. దీంతో వెంటనే అతను అమ్మ కాళ్లు పట్టుకుని గోదావరి నదిలోకి నెట్టేశాడు. ఆ తరువాత చెల్లిని నన్ను గోదావరిలోకి నెట్టేశాడు. నా కళ్ల ముందే అమ్మ, చెల్లె నదిలో కొట్టుకుపోయారు. నేను బ్రిడ్జ్‌కు ఉన్న ఓ పైప్ పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాను. నా దగ్గర ఉన్న ఫోన్‌తో 100కు ఫోన్ చేస్తే పోలీసులు సమాచారం అందించాను. నన్ను రక్షించాలని కోరాను. నేనిచ్చిన సమాచారంతో పోలీసులు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి నన్ను రక్షించారు. అందరం కలిసి ఉందామని అమ్మను నమ్మించి ఇలా చేసిన అతడికి తగిన శిక్ష వేయాలి" అని చిన్నారి కన్నీటి పర్యంతమైంది.