కోడికత్తిని ఇచ్చింది బొత్స సత్యనారాయణ మేనల్లుడే

Byline :  Veerendra Prasad
Update: 2023-08-30 02:56 GMT

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ పై కోడికత్తితో దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ ఇప్పటి వరకు బెయిల్‌పై విడుదల కాలేదు. అయితే ఈ కేసు విచారణను విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ అయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు సీఎం వైఎస్ జగన్ హాజరుకావాలని నిందితుడు శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది సలీం కోర్టును కోరారు. లేని పక్షంలో బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు కాలేదని అన్నారు. ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ విచారణలో తేల్చినప్పటికీ ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాజకీయాల కోసమే కేసు విచారణను వాయిదా వేస్తున్నారా అని ప్రశ్నించారు. 'రావాలి జగన్‌.. చెప్పాలి వాదన.. ఇవ్వాలి ఎన్‌వోసీ.. అనేది మా వాదన’ అని ఆయన వివరించారు.

అయితే ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సిద్ధిరాములు సైతం తన వాదనలు వినిపిస్తూ.. . ఇప్పటివరకు విజయవాడ కోర్టులో సమర్పించిన రికార్డులను పరిశీలించి విచారణ ముందుకు తీసుకెళ్లడానికి సెప్టెంబరు 18 వరకు గడువునివ్వాలని కోర్టు కోరారు. అయితే పరిశీలనకు అంత సమయం అవసరం లేదంటూ న్యాయమూర్తి మురళీకృష్ణ సెప్టెంబరు 6కు వాయిదా వేశారు. అదే రోజు నిందితుడు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినే అవకాశాలున్నాయి.

విచారణ అనంతరం లాయర్ సలీం కోర్టు బయట విలేకరులతో మాట్లాడుతూ.. ‘కోడికత్తి దాడి సంఘటనకు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కారణం. సంఘటన జరిగిన రోజు కోడికత్తిని తీసుకొచ్చి ఈ కేసులో సాక్షిగా ఉన్న దినేష్‌కుమార్‌కు ఆయనే ఇచ్చారు. నేరాన్ని జనపల్లి శ్రీనుపై నెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు హాజరైతే వాస్తవాలు వెల్లడవుతాయనే భయంతోనే రావడం లేదు’ అని సలీం ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇక విచారణ వాయిదా వేశాక శ్రీనివాసరావును మళ్లీ రాజమహేంద్రవరం జైలుకే తరలించారు. రాజమహేంద్రవరం, విశాఖ ఏ జైలైనా ఫర్వాలేదు.. న్యాయం జరిగితే చాలంటూ నిందితుడు శ్రీను మీడియా ఎదుట మాట్లాడారు.

Tags:    

Similar News