Chandrababu And Lokesh Cases : చంద్రబాబు, లోకేష్ కేసులపై నేడు హైకోర్టులో విచారణ

Byline :  Veerendra Prasad
Update: 2023-10-12 05:01 GMT

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్‌పై నమోదైన కేసులపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఐఆర్ఆర్, అంగళ్లు కేసులతో పాటు గురువారం నాడు హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ రానుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పై సీఐడీ నమోదు చేసిన కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇవ్వకపోవడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. బెయిలు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి నేడు ఈ పిటిషన్‌పై విచారణ జరపనున్నారు.

ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పైన కూడా ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. అంగళ్లు కేసులో గురువారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. ఈ కేసు మళ్లీ విచారణకు వస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పైనా హైకోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. గతంలో ఈ కేసుపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. గురువారం వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ తీర్పునిచ్చింది. దీంతో ఈ కేసు ఈ రోజు మళ్లీ విచారణకు రానుంది. స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేష్‌ను కూడా నిందితుడిగా చేర్చింది సీఐడీ.

ఐఆర్ఆర్, అంగళ్లు కేసులో నిన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. పిటిషనర్ అభ్యర్థనపై సూచనలు తీసుకోవాలని సీఐడీ, హోంశాఖ లాయర్లను హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని విచారణకు సహకరిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. విచారణను హైకోర్టు 12 గంటలకు వాయిదా వేసింది.




Tags:    

Similar News