Cyclone Michaung: నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Byline :  Veerendra Prasad
Update: 2023-12-04 04:36 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 13 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతున్నది. ప్రస్తుతానికి చెన్నైకి 150 కిలోమీటర్లు, నెల్లూరుకు 250 కిలో మీటర్లు, బాపట్లకు 360 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 380కిలో మీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు- మచిలీపట్నం మధ్య తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తుపాన్ నేపథ్యంలో గోదావరి తీరప్రాంతాల్లో చేపల వేటను నిలిపివేయాలని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. వరి కోతలు మానుకోవాలని రైతులకూ సూచించారు. ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నస్టం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. సోమ, మంగళవారాల్లో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సచివాలయ సిబ్బంది అందుబాటులో వుండాలని, ప్రజలకు అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు.

ఇదిలావుంచితే, నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షనూ వాయిదా వేసింది. ఎన్టీఆర్ జిల్లాలో నేడు, రేపు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కాగా మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రైతులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. ధాన్యంలో తేమ శాతాన్ని చూడకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. 'ధాన్యంలో తేమ శాతం పట్టించుకోవద్దు. ధాన్యం సేకరించి వెంటనే మిల్లుకు తరలించాలి. 7 జిల్లాల్లో 2 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయాలి. సదరు జిల్లాల్లో డ్రయర్లు లేకుంటే పొరుగు జిల్లాలకు పంపాలి. అందుకయ్యే రవాణా ఖర్చులనూ భరించాలి' అని స్పష్టం చేశారు.




Tags:    

Similar News