టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా అంగళ్లు కేసులో గురువారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ రెండు కేసుల్లోనూ సీఐడీ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు చంద్రబాబుకు కాస్త ఊరటనిచ్చింది.
మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఏపీ సీఐడీ అధికారులు దాదాపు ఆరు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అధికారులు లోకేష్ను 50 ప్రశ్నల వరకు అడిగినట్లు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. ఇవాళ మళ్లీ విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆయన విచారణకు హాజరయ్యారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఏ -1గా, నారాయణను ఏ-2గా పేర్కొన్న సీఐడీ, నారా లోకేష్ను ఏ-14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో చేసిన మార్పుల ద్వారా లోకేష్ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని సీఐడీ ఆరోపించింది.