విశాఖపట్నం గంగవరం పోర్ట్ వద్ద టెన్షన్ నెలకొంది. అదాని గంగవరం పోర్టులో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోర్టు ముట్టడికి భారీగా కార్మికులు, కార్మిక సంఘ నేతలు తరలివచ్చారు. రాజకీయ పార్టీలు, ప్రజసంఘాలు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నాయి. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పోర్టువైపుకు ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో యుద్ధవాతవరణం నెలకొంది.
పోర్టు ప్రధాన ద్వారానికి 100 మీటర్ల దూరంలోని అదనపు గేటు వద్ద ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికులు, నిర్వాసితుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులను తోసుకుంటూ పోర్టులోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడం గందరగోళానికి దారి తీసింది. పలువురు పోలీసులకు, కార్మికులు గాయపడ్డారు.
కొంతమంది మహిళలు సొమ్మసిల్లి పడిపోగా.... గాజువాక సీ.ఐ కాలికి ముల్ల కంచె దిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లకు తలకి తీవ్ర గాయాలయ్యాయి.