తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లుగా కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలైంది. ఈ ఏడాది జున్ 2తో ఉమ్మడి రాజధాని గడువు పూర్తి కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న పరిస్థతిని గుర్తించి మరో పదేళ్లు గడువు పొడిగించాలని ప్రజా సంక్షేమ కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ పిల్‌ను దాఖలు చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు తొమ్మిదవ షెడ్యూల్లోని కంపెనీలు, కార్పొరేషన్ల ఆస్తుల విభజన పూర్తి కాలేదని అందులో పేర్కొన్నారు. 2034 జూన్ 2వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా, కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. ఉమ్మడి కృష్ణాజిల్లా, ఇబ్రహీంపట్నంకి చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించడంతో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, అంగీకారం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆస్తుల విభజన వివాదాలకు దారితీసింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలోనే వివాదాలు పరిష్కారం కావాలి. లేకుంటే ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయి. విభజన హామీలు అమలు కానందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరే హక్కు ఏపీకి ఉంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని 2034వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు చట్టం తెచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి’ అని వాజ్యంలో ఆయన పేర్కొన్నారు. అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే డిమాండ్ తో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడ సాగుతున్నా సంగతి తెలిసిందే. అమరావతి జేఏసీ ప్రతినిధులు ఈ విషయమై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయమై కోర్టులో విచారణ సాగుతుంది. న్యాయపరమైన చిక్కులు తొలగితే విశాఖపట్టణం నుండి రాజధానిని కొనసాగించాలని సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు.