టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు

Byline :  Veerendra Prasad
Update: 2023-09-01 05:35 GMT

ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ జాతీయ దిన పత్రిక పేర్కొంది. ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల ద్వారా కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు ఆయన ఉన్నట్లు ఆ కథనంలో తెలిపింది. షోకాజ్ నోటీసుల పై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు వివరించింది. ఆగస్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. షోకాజ్‌ నోటీసుల్లో.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఐటీ శాఖ ప్రశ్నించిందట.




 2019లో ఐటీ శాఖ అధికారులు షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ నివాసంలో 2019 నవంబర్‌లో సోదాలు నిర్వహించారు. అక్కడ లభించిన సమాచారంతో 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ నివాసంలో సోదాలు చేశారు. అక్కడ దొరికిన సమాచారంతో ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ను తయారు చేసింది. లభించిన ఆధారాల ప్రకారం సంబంధిత వ్యక్తులను పిలిపించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆ వాంగ్మూలాలపై వారు సంతకాలు కూడా పెట్టారు. వాటన్నింటి ఆధారంగా ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు నోటీసులు పంపినట్లు సమాచారం. షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరిల్లో టిడ్కో ఇళ్లు, అమరా­వతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతోపాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ పనులు చేసింది. ఆయా పనుల్లో చంద్రబాబు కమీషన్లు తీసుకున్నారనే ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీనివాస్‌ అనే వ్యక్తి ద్వారా బోగస్‌ కంపెనీలు ఏర్పాటు చేసి సబ్‌ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నట్లు ఐటీ గుర్తించిందని తెలిసింది.

ఈ అక్రమ లావాదేవీలు అన్నీ షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ కోడ్‌ భాషలో తన ఈ–మెయిల్‌ ఐడీకే మెయిల్‌ చేసుకుని భద్ర పరిచినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారట. ఎవరెవరికి ఎంతెంత మొత్తం చెల్లించింది కోడ్‌ భాష ‘టన్నుల’ రూపంలో పేర్కొన్నట్టుగా పూర్తి వివరాలు వెల్లడ­య్యా­యని తెలిపారు. హైదరాబాద్‌కు 3 టన్నులు, ఢిల్లీకి 3 టన్నులు, ముంబాయికి 3.5 టన్నులు.. ఇలా భారీగా నిధులను మళ్లించినట్లు ఐటీ అధికారులు గుర్తించారని అంటున్నారు. 




Tags:    

Similar News