వెంకన్నకు బంగారు తాబేలు..ఇన్ఫోసిస్ సుధా నారాయణమూర్తి దంపతుల భారీ విరాళం
ఇన్ఫోసిస్ వ్యవస్థాపక ఛైర్మన్ నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులు.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం సమర్పించారు. ఆదివారం శ్రీవారి సేవలో పాల్గొన్న నారాయణ మూర్తి దంపతులు 2కేజీల బంగార కానుకలు అందజేశారు. ఆలయ ఈఓ ధర్మారెడ్డికి బంగారు తాబేలు, బంగారు శంకువుని ఇచ్చారు. దాదాపు రెండు కేజీల బంగారంతో తయారు చేయించిన వీటి విలువ కోటిరూపాయలు ఉండనున్నట్లు సమాచారం.వాటిని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది. దర్శనం అనంతరం తిరుమల వేద పండితులు.. వారికి వేద ఆశీర్వాదం అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి శేషవస్త్రంతో మూర్తి దంపతులను సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని బహుకరించారు. ప్రస్తుతం టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యురాలిగానూ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
70 ఏళ్లుగా తిరుమల కొండకు వస్తున్నానని సుధామూర్తి తెలిపారు. తొలిసారి తాను 1953లో తిరుమల కొండకు వచ్చానని ఆమె చెప్పారు. కోరుకున్న కోరికలు తీరడంతో అందరి భక్తుల మాదిరిగానే ఏటా శ్రీవారి దర్శనానికి వస్తున్నానన్నారు. శ్రీవారికి బహుకరించిన ఆభరణాల గురించి ప్రశ్నించగా.. సుధామూర్తి మాట్లాడేందుకు నిరాకరించారు. ‘ఆ ఆభరణాలను స్వామి వారికి కానుకగా ఇచ్చేశాం. ఇక వాటి గురించి మాట్లాడకూడదు’ అంటూ ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు.