Prashant Kishore : బాబు పప్పులైనా, జగన్ పప్పులైనా అతని నీళ్లతోనే ఉడకాలి!

By :  Kalyan
Update: 2023-12-12 12:15 GMT

ఎన్నికల్లో గెలుపోటములు ఒకప్పుడు పార్టీల సిద్ధాంతాలు, నాయకుల పనితీరు వంటివాటిపై ఆధారపడి ఉండేవి. ప్రశాంత్ కిషోర్ గజకర్ణ గోకర్ణ, టక్కుటమార విద్యల పుణ్యమా అని ఎన్నికలు అడ్డగోలు వ్యవహారంగా మారిపోయాయి. పార్టీల బలబలాలు విశ్లేషించి ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టడంలో చాణక్యుడికి తాత అతడు. నైతిక, అనైతిక వ్యూహాలు రచించే పీకే టీమ్ పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీల విజయానికి దోహద పడింది. కొన్నిచోట్ల చుక్కెదురైనా పీకే టీమ్ కసిగా పనిచేస్తే గెలుపు గ్యారంటీ అనే అభిప్రాయం ఉంది. ఆ సేవలు చాలా ఖరీదు. వందల, వేల కోట్ల ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

తను ప్రస్తుతం కన్సల్టింగ్ సేవలకు పూర్తిగా స్వస్తి పలికి బిహార్‌లో తన పార్టీ జన్ సూరజ్‌ను బలోపేతం చేసుకుంటున్నానని అతడు చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పీకే ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకుంటూనే ఉన్నట్లు తెలుస్తోంది. అతని ‘ఐప్యాక్’ టీ‌మ్‌లో పనిచేసిన రాబిన్ శర్మ, సునీల్ కనుగోలు, రుషిరాజ్ సింగ్, శంతను సింగ్ తదితరులు గురువుగారి వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు సునీల్ కనుగోలు కృషి ఉందన్నది బహిరంగ సత్యమే.

త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం పీకే బ్యాచ్ కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే టీమ్స్ ఏర్పాటయ్యాయి. అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి వ్యూహాలను పీకే బృందమే రచిస్తుండడం విశేషం. చంద్రబాబు అరెస్టయ్యాక పీకే.. టీడీపీ తరఫున రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. లోకేశ్ బాబు ఢిల్లీ వెళ్లి అతనితో రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తను ఎన్నికల మేనేజ్‌మెంట్ వ్యూహాలకు దూరంగా ఉంటున్నానని పీకే చెబుతున్నా ‘సలహాలు, సూచనలు’ మాత్రం కొసాగుతాయన్నట్లుగానే ఉంది అతని ధోరణి.

పీకే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గెలుపు కోసం పనిచేశాడు. 2021లో మమతా బెనర్జీ గెలుపు కోసం పనిచేసిన తర్వాత తను ఎలక్షన్ మేనేజ్‌మెంట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. అయితే పలు రాష్ట్రాల నేతలు పీకే సేవల కోసం క్యూ కడుతున్నారు. వారి కోరిక నెరవేర్చడానికి పీకేకి బదులు అతని ఐప్యాక్ మాజీ సహచరులు, శిష్యులు రంగంలోకి దిగుతున్నారు. రుషి రాజ్ సింగ్ ప్రస్తుతం వైపీసీ కోసం పనిచేస్తున్నాడు. మారో మాజీ ఐప్యాక్ మెంబర్ శాంతను సింగ్ వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీ వైపు తిరిగాడు. ఐప్యాక్ మూలాలున్న షోటైమ్ కన్సల్టింగ్ సంస్థ కూడా టీడీపీ కోసం పనిచేస్తోంది. దీన్ని ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడైన రాబిన్ శర్మ స్థాపించాడు. 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించే గురుతర బాధ్యతను తీసుకున్న రాబిన్ ఏపీ ప్రజల నాడిని కనిపెట్టడానికి విరివిగా సర్వేలు చేయిస్తున్నాడు. సునీల్ కనుకోలు సేవల కోసం కూడా పచ్చపార్టీ ప్రయత్నిస్తోంది. టీడీపీ, వైసీపీ రెండూ పీకేతో సంబంధమున్న వ్యూహకర్తల సేవల కోసమే పాకులాడ్డం గమనార్హం. తన అవసరం తప్పనిసరైనప్పడు పీకే కూడా ‘సలహాలు, సూచనల’ రూపంలో రంగంలోకి దిగితే అంతగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.




Tags:    

Similar News