CM Jagan : గుడివాడకు గుండు సున్నా...ఆ విషయంలోను పక్కన పెట్టిన జగన్
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అటు అధికార పార్టీ నేతలు, ఇటు ప్రతిపక్షాలు హోరాహోరీగా అభ్యర్థులను ఎంచుకుంటున్నారు. అయితే సీఎం జగన్ సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే కొడాలి నానికి టికెట్ నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు ముఖ్యమంత్రి జగన్ మరో జలక్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జీగా జగన్ మరొకరిని నియమించారు. అంతేగాక సిట్టింగ్ గా ఉన్న అమర్ నాథ్ కు టికెట్ నిరాకరించారు. అయితే తాజాగా మరో విషయంలోనూ జగన్ ఆయనను పక్కన పెట్టారు.
ఇవాళ ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ వైజాగ్ రానున్నారు. అమర్ నాథ్ మంత్రి అయిన తర్వాత విశాఖకు వీఐపీలు, ప్రముఖులు వస్తే వారిని రీసివ్ చేసుకునే బాధ్యతను ఆయనకు అప్పగించేవారు. అయితే ఈసారి అమర్ నాథ్ కి కాకుండా ఆ బాధ్యతను మంత్రి బూడి ముత్యాలనాయుడుకు అప్పగించారు. రీసివ్ చేసుకునే బాధ్యతను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యత నుంచి కూడా అమర్ నాథ్ ను తప్పించడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.