రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే దాదాపు లక్షకుపైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడురు వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయని పవన్ ఆరోపించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అన్ని అంశాలను సీఈసీకి వివరించారని పవన్ చెప్పారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగాలని సీఈసీ నిర్ణయించిందని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు ఏపీలో పర్యటిస్తున్నారు. ఓటర్ల తుది జాబితా, ఎన్నికల సంసిద్ధతపై సీఈసీ రాజీవ్‌కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సీఈసీ విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఇక వైసీపీ నుంచి ఎంపీ విజయసాయి రెడ్డి సీఈసీని కలిశారు. బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ఆప్ నేతలు సైతం ఎన్నికల సంఘం అధికారులను కలిసి వివిధ అంశాలపై చర్చించారు.