వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన అధికారంలోకి రావడం ఖాయమని జనసేప చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ఈసారి కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులమైతే వైసీపీ నేతలు కౌరవులని అన్నారు. జగన్ను ఓడించడమే జనసేన లక్ష్యమన్నారు. పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభమైంది. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఐదు రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ జగన్ పాలనపై నిప్పులు చెరిగారు.
పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని పవన్ విమర్శించారు. తాను అధికారం కోసం అర్రులు చాచడం లేదని.. ప్రజల భవిష్యత్ కోసమే ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ‘‘వైసీపీకి 100కుపై సభ్యులుగా ఉన్నారు కాబట్టి వారు కౌరవులే. జగన్ అధికారం నుంచి దిగడం.. మేం అధికారంలోకి రావడం ఖాయమం. మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ అండగా ఉంటాం. 30వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. అధికారం కోసం నేను అర్రులు చాచడం లేదు. మీ భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నాను. మనకంటే.. మన పార్టీ కంటే.. మన నేల ముఖ్యం’’ అని పవన్ అన్నారు.
ఆశయాలు, విలువల కోసమే పార్టీని నడుపుతున్నట్లు పవన్ చెప్పారు. ‘‘ఈ పదేళ్లలో జనసేన చాలా దెబ్బలు తిన్నది. వైసీపీని ఓడించడమే జనసేన టార్గెట్. చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు చీలకూడదు అన్నాను. లక్షకోట్లు, కిరాయి సైన్యం, పోలీస్ శాఖ వాళ్ల దగ్గర ఉంది. మా దగ్గర ఒక మైక్ మాత్రమే ఉంది. మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెబుతున్నా.. ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు తీరుస్తాను. ఓటమి నిస్సహాయంగా ఉంటుంది. ఆశయాలు, విలువలకోసం నడిపేవాడ్ని కాబట్టే నిలబడి ఉన్నాను’’ అని పవన్ అన్నారు.