జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యమన్నారు. పలుచోట్ల ఇబ్బందులు ఉన్నా టీడీపీతో కలిసి ముందుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. జనసేన - టీడీపీ ప్రభుత్వం వచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతికూల సమయాల్లోనే నాయకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి బలమైన రీతిలో దిశానిర్ధేశం చేయాల్సిన అవసరముందన్నారు.
‘‘జనాదరణతోనే మనం ఈ స్థాయికి వచ్చాం. 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైంది. ప్రస్తుతం పార్టీలో 6.5లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. పార్టీ పరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదు. జనసేన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులే. క్రియాశీల సభ్యుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందులున్నా సర్దుకుని ముందుకు వెళ్లాలి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని పవన్ అన్నారు.