Pawan kalyan: సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి ప్రజలకిస్తాడా..

Byline :  Veerendra Prasad
Update: 2024-02-04 15:04 GMT

"ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు తాను మహాభారతంలో అర్జునుడిలా ఫీల్ అవుతున్నారు.. మమల్ని కౌరవులతో పోల్చుతున్నారు.. కానీ ఇది కలియుగం కౌరవులు, పాండవులతో పోల్చుకోవద్దు" అని సీఎంకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బాలశౌరికి కండువా కప్పి పవన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జగన్ తనను అర్జునుడిలా పోల్చుకుంటున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సొంత చెల్లెలు షర్మిల గురించి వైసీపీ నేతలు, కార్యకర్తలు నీచంగా మాట్లాడుతుంటే జగన్ పట్టించుకోవడం లేదని.. అలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకోవడం సిగ్గు చేటని అన్నారు. అర్జునుడు తన ఆడపడుచుల్ని రక్షించాడు కానీ, ఎప్పుడూ తూలనాడలేదన్నారు. సొంత చెల్లి గురించి నీచంగా మాట్లాడుతుంటే ఎంకరేజ్‌ చేసే వ్యక్తి జగన్‌ అని అన్నారు.

తాను ఓ స్టార్ హీరో కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలీగా గుర్తిస్తే గర్వపడతానన్నారు పవన్ కల్యాణ్. పదవులపై తనకు ఆశలేదని.. అడ్డదారులు తొక్కి అడ్డగోలుగా సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. జగన్ మాట్లాడితే సిద్ధం.. సిద్ధం అంటున్నారని.. ఎన్నికలకు మేం కూడా సిద్ధంగానే ఉన్నామని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అన్నింటికీ బదులు చెల్లించాల్సిన టైమ్ వస్తుందని హెచ్చరించారు. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు.. కానీ, ఒక రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. జగన్‌ ఎన్ని మోసాలు, మాయలు చేసినా వాటన్నింటినీ అధిగమించి లక్ష్యాన్ని చేరుకుందామని పిలుపునిచ్చారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తునమనేది కాదని.. గెలిచే సీట్లలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి బలంగా అసెంబ్లీలోకి అడుగు పెడతామని.. 2024లో ఏపీలో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబ్బా కొట్టుకోవల్సిన పనిలేదు, ఎవరుండాలో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. సీఎం మాట్లాడే ప్రతీ మాటకు కౌంటర్లుంటాయన్నారు. అన్ని సమస్యల్ని అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీలో జనగళం బలంగా ఉండబోతుందన్నారు.

Tags:    

Similar News