సుపారీ గ్యాంగులను దింపారు.. అయినా భయపడను - పవన్ కల్యాణ్

Update: 2023-06-18 04:31 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, కొందరు సుపారీ గ్యాంగులను రంగంలోకి దించారని తనకు సమాచారముందని అన్నారు. అందుకే జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశంలో పవన్ ఈ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో జనసేన పార్టీ బలంగా ఉందన్న పవన్.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గద్దె దించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారం తమకు దక్కదన్న భావన నాయకులను క్రూరంగా మార్చేస్తుందని, వైసీపీ పాలకులు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. తనను ఎంత భయపెడితే అంత రాటుదేలతానని పవన్ స్పష్టం చేశారు.

వైసీపీకి ఒక్క సీటు రావొద్దు

ఏపీ రాజకీయాల్లో కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీకి దక్కకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన వ్యూహంతో ముందుకెళ్తుందని చెప్పారు. కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు, వీర మహిళలపై గతంలో చేసిన దాడిని మర్చిపోనని అన్నారు. ఓ బలమైన కార్యాచరణ లేనందున అప్పట్లో వెనుకడుగు వేశామని.. అన్నింటికీ సరైన రీతిలో సమాధానం చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని స్పష్టం చేశారు.

అడ్డుకుంటున్న అభిమానం

సినీ నటుడిని కాకపోయి ఉంటే బలమైన రాజకీయ నేతగా జనంలోకి చొచ్చుకెళ్లేవాడినని, కానీ తనను అభిమానుల తాకిడి అడ్డుకుంటోందని పవన్ చెప్పారు. జనసేన పార్టీని తపనతో నడుపుతున్నానన్న ఆయన... దీనివెనుక బలమైన భావజాలం, సిద్ధాంతం ఉన్నాయని అన్నారు. తనను యువత నమ్మతున్నారంటే అది కేవలం భావజాలం కలిపిన ఓ సున్నితమైన బంధమని అన్నారు. యువత నమ్మితే సిద్ధాంతం కోసం ప్రాణాలివ్వడానికి అయినా సిద్ధంగా ఉంటారని పవన్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News