ప్రజలు కోరుకుంటే సీఎం స్థానంలో కూర్చుంటా :పవన్ కల్యాణ్

Update: 2023-07-20 13:56 GMT

ఏపీ అభివృద్ధి కోసం జైలు కెళ్లడానికి, దెబ్బలు తినేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎదుర్కుంటానని తెలిపారు. వైసీపీ వీడిన విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు గురువారం మంగళగరిలోని కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్ పార్టీ కండువా కప్పి రమేశ్‌బాబును జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరెస్ట్‌కు సిద్ధం..

వలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలకు నోటీసులు రావడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. "నన్ను ప్రాసిక్యూట్ (విచారణ) చేయాలని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. మీరు ప్రాసిక్యూషన్‌ అంటే నేను సిద్ధంగానే ఉన్నా. నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు. చిత్ర హింసలు పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైన సిద్ధంగా. కేసులకు భయపడే వ్యక్తిని అయితే పార్టీ ఎందుకు పెడతాను. ఎక్కడికి వచ్చి అయినా నన్ను విచారించుకోవచ్చు. నా అరెస్ట్ జరిగితే అదే ప్రభుత్వానికి నాంది అవుతుంది. న్యాయం కోసం మాట్లాడితే నోటీసులు వస్తాయి. హత్యలు చేసిన వాళ్లను ఎలా కాపాడుతున్నారో చూస్తున్నాం. " అని పవన్ నిప్పులు చెరిగారు.

వలంటీర్స్‎పై మరోసారి..

వలంటీర్స్‌పై పవన్ వెనక్కు తగ్గడం లేదు. మరోసారి వలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేశారు. " వలంటీర్లతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు. ఇది డేటా చౌర్యం కిందకు వస్తుంది. వాలంటీర్లు సేకరించిన డేటా హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని ఓ ఎజెన్సీకి వెళ్తోంది. ఆ కంపెనీ వైసీపీ నేతలదని చెబుతున్నారు. వలంటీర్లకు అధిపతి ఎవరు ? వలంటీర్ల విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారు. ఒక్కో వలంటీరుకు ఇచ్చే రోజు వేతనం 164 రూపాయలు. డిగ్రీ చదివిన వారికి ఉపాధి హామీ పథకం కంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నారు" అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

సీఎం స్థానంలో కూర్చుంటా..

ప్రజలందరూ కోరుకుంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటా అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాను సీఎం కావడం కంటే ప్రజలందరూ బాగుండాలన్నారు.

సమాజంలో మార్పు తెచ్చే అధికారం కావాలన్నారు. మొదట జనసేన పార్టీ శ్రేణులు బాగా తిరగాలని...ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని పిలుపునిచ్చారు. జగన్‌ను ఇంటికి పంపించాలి.. లేదా చర్లపల్లి జైలుకు పంపించాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏపీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని అమిత్ షా తనతో చెప్పినట్లు పవన్ వివరించారు. ప్రధానితో తన సంబంధం ఏపీ భవిష్యత్తు, అభివృద్ధికి సంబంధించిందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News