నాకు సైట్ వచ్చింది, జగన్ ఓ పాము... పవన్ కల్యాణ్

Update: 2023-06-25 16:39 GMT

‘‘మాపై ఒక్క రాయి వేసి చూడండి, మా తడాఖా ఏమిటో చూపిస్తాం,’’ అని వైకాపా నేతలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టిగా హెచ్చరించారు. వైసీపీ నేతల అవినీతి చిట్టాలను చదివి చదివి తనకు సైట్ వచ్చిందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తప్పుడు పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పట్టించారని తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఆదివారం కోనసీమ జిల్లాలలో మలికిపురంలో నిర్వహించిన ‘వారాహి విజయయాత్ర’ సభలో ప్రసంగించారు. జనసేన కార్యకర్తలను వైకాపా నేతలు పనిగట్టుకుని వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మా కార్యకర్తల జోలికి, జనసైనికురాళ్ల జోలికి వస్తే మిమ్మల్ని ఇళ్లలోంచి బయటి లాక్కొచ్చి కొడతాం. మాతో పెట్టుకోవాలంటే మరో పాతికేళ్ల యుద్ధానికి సిద్ధంగా ఉండండి. మాపై ఒక్కరాయిపడినా ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని హెచ్చరించారు. సొంత బాబాయినే చంపుకున్న జగన్ ప్రజలు ఎలా నమ్ముతారని, అతడు తన పిల్లల్ని తనే మింగే పాములా సొంతవాళ్లనే మింగుతాడని తీవ్ర విమర్శలు చేశారు.

నేనొచ్చింది అందుకు కాదు

తాను ఓట్లు చీల్చడానికి రాజకీయాల్లోకి రాలేదని పవన్ మరోసారి స్పష్టం చేశారు. కొందరు ప్రజల మధ్య కులాల చిచ్చు పెడుతున్నారని, తను అందరినీ కలపడానికే వచ్చానని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్న ఆయన పన్నుల్లో 40 శాతం వైకాపా నేతల జేబుల్లోకి వెళ్తోందన్నారు. ‘‘రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. జగన్ ఎన్ని బటన్లు నొక్కేతే ఏం లాభం? డబ్బులు అందరి ఖాతాల్లోనూ పడుతున్నాయా?’’ అని ప్రశ్నించారు. వైకాపా నేతల అవినీతి ఫైళ్ల గుట్టలు చదివి తనకు చత్వారంతో చూపు సరిగ్గా కనిపించడం లేదని, అందుకే కళ్లజోడు పెట్టుకుని చదువుకుంటూ ఉంటానన్నారు. 2019 ఎన్నికల్లో రెండుచోట్ల ఓడిపోవడంపైనా ఆయన ఉద్వేగంగా స్పందించారు. ఓడిన రోజు కత్తితో తన గుండెను కోసినట్టు అనిపించిందని, అయితే రాజోలులో ప్రజలు తమ పార్టీకి గెలిపించడం ఊరటనిచ్చిందని అన్నారు. 

Tags:    

Similar News