గ్రామ వాలంటీర్స్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వాలంటీర్స్ ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని మండిపడ్డారు. విశాఖ పర్యటన సందర్భంగా ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబాన్ని పవన్ కల్యాన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్‌కు వాలంటీర్లకు తేడాలేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వృద్ధురాలు చనిపోయి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంతవరకు నెతలెవరూ వచ్చి కనీసం ఆ కుటుంబాన్ని పలకరించకపోవడం దారుణమన్నారు.
చాలా చోట్ల వాలంటీర్స్ అఘాయిత్యాలకు పాల్పడిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వాలంటీర్స్‌ను ఉద్యోగంలోకి తీసుకునే ముందు ఎందుకు పోలీస్ వెరిఫికేషన్ చేయించలేదని పవన్ ప్రశ్నించారు. కొంతమంది వాలంటీర్స్ నుంచి పిల్లలు, పెద్దవారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. తమపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం తప్పు చేసిన వారిని మాత్రం వదిలేస్తుందని విమర్శించారు.
ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. వారాహి యాత్రలో భాగంగా మాట్లాడుతూ తీవ్ర విమర్శలలో విరుచుకుపడుతున్నారు. వుమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని, డేటా చోరీ చేస్తున్నారని పవన్ ఆరోపిస్తున్నారు. దీంతో ఈ అంశంపై వైసీపీ -జనసేన మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది.