Kesineni Shwetha: విజయవాడ కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా
కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత (Kesineni Swetha) రాజీనామా చేశారు. సోమవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదించాలని కేశినేని శ్వేత కోరారు. చంద్రబాబు వద్దనుకున్నారు అందుకే పార్టీ నుంచి వెళుతున్నామన్నారు. చంద్రబాబు చెప్పారని ఉద్యోగం కూడా వదిలేసి.. కార్పొరేటర్ గా పోటీ చేశానన్నారు. మా అవసరం ఉన్నప్పుడు పార్టీకి పని చేశామని, ఇప్పుడు వద్దనుకున్నారు కాబట్టి... పార్టీ నుండి వెళ్లిపోతున్నామన్నారు. చాలా చోట్ల టీడీపీ కి ఎంపీ అభ్యర్థులు లేరని, లేని చోట వదిలేసి.. కేశినేని నాని గారికే ఎందుకు టికెట్ ఇవ్వను అని చెబుతున్నారో తెలియదన్నారు. కేశినేని నాని మూడో సారి ఎంపీగా పోటీ చేస్తారని, లోక్‌సభలో అడుగుపెడతారని నమ్ము తున్నానని చెప్పారు.
మరోవైపు కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేస్తున్న విషయాన్ని తండ్రి కేశినేని నాని ముందుగానే చెప్పారు. ఈరోజు ఉదయం ఫేస్‌బుక్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి... తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ఆయన పేర్కొన్నారు. అన్నట్టుగానే కార్పొరేటర్ పదవికి శ్వేత రాజీనామా చేశారు. కాగా.. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ఇప్పటికే కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, వీరి రాజీనామాలతో టీడీపీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. రాజీనామాల నేపథ్యంలో విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది.