చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మరోసారి రెచ్చిపోయారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా జెండా సభలు పెట్టుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాశనం చేస్తున్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 లక్షల కాపుల పాదాలు చంద్రబాబు తిరిగి లేవకుండా అథ పాతాళానికి తొక్కుతాయని మండిపడ్డారు.
పవన్ ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారని ఎద్దేవా చేశారు. జనసేనను మోసం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తన సొంత సామాజికవర్గానికి 21 సీట్లు కేటాయించారని... రానున్న రోజుల్లో మరో 10 సీట్లు ఇస్తారని చెప్పారు. 3 శాతం ఉన్న కమ్మ సామాజికవర్గానికే 31 సీట్లు ఇస్తే.. 20 శాతం ఓటింగ్ ఉందని చెప్పుకుంటున్న జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలని ప్రశ్నించారు. చంద్రబాబు విసిరేసిన 24 సీట్లతో తాము అసంతృప్తిగా ఉన్నామని జనసైనికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ చేతిలో మోసపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని..సీఎం జగన్ ను పవన్ దారుణంగా తిడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే అని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.