తిరుమల ఘాట్‌రోడ్‌లో మరోసారి చిరుత కలకలం

Update: 2023-07-12 16:50 GMT

తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. ఇటీవలె అలిపిరి నడక దారిలో చిరుత ఓ చిన్నారిపై దాడి చేసి గాయపరిచిన ఘటన మరువక ముందే మరోసారి కన్పించింది. ఇవాళ సాయంత్రం ఘాట్‌ రోడ్‌లోని 56వ మలుపు వద్ద భక్తులు చిరుతను చూశారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. చిరుతను దారి మళ్లించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. జీఎన్సీ వద్ద వాహనదారులను గుంపుగా పంపిస్తున్నారు.

ఇటీవల కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన దంపతులు తమ నాలుగేళ్ల కొడుకుతో కలిసి కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరారు. మొదటి ఘాట్‌ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో కూర్చుని ఆహారం తీసుకుంటుండగా.. బాలుడు పక్కనే ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత పులి.. చిన్నారి తలను నోటకరచుకుని అడవిలోకి తీసుకుపోయింది. స్థానికులు, భద్రతాసిబ్బంది కేకలు పెడుతూ పులి వెనుక పరుగులు తీశారు.

ఆ అరుపుతో భయాందోళనకు గురైన చిరుత.. పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ వద్ద బాలుడిని విడిచిపెట్టింది. చిరుత దాడిలో బాలుడికి పలు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నుంచి కౌశిక్‌ ప్రాణాలతో బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత అటవీ సిబ్బంది చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో భక్తులు రిలీఫ్ అయ్యారు. తాజాగా మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News