MP Balashowry: 'ఇక నుంచి పవన్‌తోనే'... జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి

Byline :  Veerendra Prasad
Update: 2024-02-04 14:11 GMT

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆదివారంపవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ మేరకు మంగళగిరిలోని కార్యాలయంలో ఆయనకు పవన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక తన రాజకీయ భవిష్యత్తు కోసం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన బాలశౌరి.. పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బాలశౌరితోపాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ... ఆశించిన స్థాయిలో ఏపీలో అభివృద్ధి జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఎవరూ రావడం లేదు. అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చేశాను. పవన్ కళ్యాణ్ ఏ పదవి ఇచ్చినా చేస్తాను. ఈ రోజు నుంచి నేను జనసేన కార్యకర్తని. పార్టీని నడపడం ఆషామాషి కాదు.సినిమాల్లో వచ్చే రెమ్యూనరేషన్ తో పవన్ పార్టీ నడుపుతున్నారు. ఇక నుంచి పవన్ తోనే నా రాజకీయ జీవితం కొనసాగుతుంది. పార్టీని అభివృద్ధి చేసుకోవడంలో అందరం కలసి పవన్ కు అండగా ఉంటాం అని అన్నారు.

ఇక సీఎం జగన్ పై సెటైర్లు వేస్తూ... తాను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని సీఎం జగన్ చెప్పడం పెద్ధ అబద్ధం. సిద్ధం పేరుతో సభలు నడుపుతున్నారు దేనికి సిద్ధం? పారిపోవడానికి సిద్ధమా..? నాకు దేవుడున్నాడని జగన్ చెబుతున్నాడు. అందరికీ దేవుడున్నాడు. దేవుడు ఏమైనా జగన్ కు వకాల్తా ఇచ్చాడా అని ప్రశ్నించారు. జనసేన సైనికులు మిమ్మల్ని వేటాడుతారని బాలశౌరి హెచ్చరించారు

Tags:    

Similar News