చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఏపీ మంత్రి ..వెంటనే బర్తరఫ్ చేసిన జగన్
ఏపీ మంత్రి గుమ్మనూరి జయరామ్ టీడీపీలో చేరారు. మంగళగిరిలో జరుగుతున్న బీసీ డిక్లరేషన్ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పార్టీలోకి చేరారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని జయరామ్ విమర్శించారు. టీడీపీలోకి తిరిగి రావడం సంతోషంగా కలిగిస్తోందని అన్నారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు.
అమరావతిలో జనసేన, టీడీపీ సంయుక్తంగా జయహో బీసీ సభను నిర్వహిస్తున్నారు. బీసీలంటే బలహీనులు కాదని బలవంతులు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బీసీల పట్ల టీడీపీ చిత్తశుద్ది ఉందని టీడీపీతోనే వారికి న్యాయం జరుగుతుందని లోకేష్ తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు వైసీపీ చిన్నచూపు చూశారని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయించిన మంత్రి గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్ అబ్థుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ చేసిన సిఫార్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే గుమ్మనూరు మంగళగిరిలో జరుగుతున్న టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ సభలో టీడీపీలో చేరారు.