TTD Ban : తిరుమలకు వచ్చే భక్తులకు కీలక సూచనలు...వాటిని తీసుకురావొద్దు
తిరుమలలో చిరుతల దాడి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిరుత దాడిలో చిన్నారి మృతి చాలా బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందించామని పెద్దిరెడ్డి తెలిపారు. మ్యాన్ ఈటర్‌గా మారిన రెండు చిరుతలను తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లోని ఉంచుతామని స్పష్టం చేశారు. తిరుమల నడకమార్గంలో కంచె ఏర్పాటు చేయడానికి టీటీడీ, అటవీశాఖ ఆలోచన చేస్తోందని చెప్పారు.
తిరుపతిలో పొల్యుషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్, ల్యాబరేటరీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడతూ భక్తులకు పెద్దిరెడ్డి కీలక సూచనలు చేశారు. తిరుమలలో 120 మైక్రాన్ల కంటే తక్కువగా ఉంటే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించామని, భక్తులెవ్వరూ తిరుమలకు తీసుకురావొద్దని సూచించారు.
మరోవైపు తిరుమలగిరుల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. బోన్లను ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తున్నారు. నడకదారిలో వెళ్లే భక్తుల రక్షణ కోసం పలు నిబంధనలను అమలు చేస్తున్నారు. అదే విధంగా చేతికర్రలను అందిస్తున్నారు. చిన్నపిల్లలపై కూడా ఆంక్షలు విధించారు. శ్రీశైలం నుంచి వచ్చిన బృందం చిరుతల సంచారంపై అధ్యయనం చేయనుంది.