Minister Roja: ఆ మూడు పార్టీలు ఒక్కటైనా.. మళ్లీ జగనే సీఎం

Byline :  Veerendra Prasad
Update: 2024-02-07 12:18 GMT

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నా... రాబోయే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ జగనే అని, 2014 ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్స్ లేదని అన్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా. ఏపీలో ఎన్ని పార్టీలు కలిసినా.. వైసీపీకి వచ్చే నష్టమేమి లేదన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌ను మంచి చేసే నాయకుడిగా నమ్ముతున్నారని, 2024 ఎన్నికల్లో కూడా ఆయనకే పట్టం కడతారని అన్నారు. చంద్రబాబు నాయుడిని ఈ ఎన్నికల్లో కూడా తరిమికొట్టడం ఖాయమని చెప్పారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా…ఈ దేశంలోనే చెత్త నాయకుడు(డర్టీ పొలిటీషియన్) చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రధాని మోదీ తల్లి, భార్యని తిట్టిన వ్యక్తి ... ఇప్పుడు ఆ ప్రధాని కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమయ్యాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

"ప్రధాని మోదీని ఇష్టానుసారంగా తిట్టాడు. ఆయనకు వ్యతిరేకంగా నల్ల జెండాలు ఎగురవేశాడు. మళ్ళీ ఇప్పుడు మోదీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. మోదీని దేశంలో లేకుండా చేస్తానని చెప్పాడు . అమిత్ షాపై తిరుమలలో రాళ్లు వేయించాడు. ఇప్పుడు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి తన కొడుకు లోకేష్‌ను పంపాడు. ఇప్పుడు చంద్రబాబుతో కలిస్తే బీజేపీకే నష్టం’ అని రోజా దుయ్యబట్టారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో పాలనలో అనుభవం ఉన్న నాయకుడని చంద్రబాబును ప్రజలు గెలిపించారని , ప్రధాని మోడీ, పవన్ కల్యాణ్ చరిష్మాతో అప్పడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు.

ఎన్నికల తేదీ సమీపిస్తోన్న కొద్ది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా జతకట్టిన టీడీపీ, జనసేన.. తాజాగా మరో అడుగు ముందుకేశాయి. త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కూడా తమ కూటమిలో కలుపుకోనున్నాయి. ఈ క్రమంలో పొత్తులపై చర్చించేందుకు టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పొత్తులపై ఆయన చర్చించున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి రోజా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు ఒక్కటైనా తమ అధినేత జగనే మళ్లీ ఏపీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో పవర్‌లో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో బలం లేదన్నారు

Tags:    

Similar News