చంద్రబాబు విడుదల కాగానే టీడీపీలో చేరుతా

By :  Bharath
Update: 2023-09-18 12:32 GMT

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు విడుదల కావాలని వైసీపీ ఎమ్మెల్యే వినాయకుడికి మొక్కుకున్నారు. బాబు జైలు నుంచి విడుదలైన మరుక్షణం టీడీపీలో చేరతానని వైసీపీ రెబల్, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. వినాయకుడి ఆశిస్సులతో చంద్రబాబుకు, ఆంధ్రా ప్రజలకు మంచి జరుగుతుందని వైసీపీ పాలన పోతుందని చెప్పుకొచ్చారు. కడపలోని ఆయన కార్యాలయంలో మాట్లాడిన మేకపాటి.. వైసీపీ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని, చంద్రబాబు జైలులో లేకపోతే ఈపాటికి టీడీపీలో చేరేవాడినని అన్నారు. తన చేరికపై టీడీపీ నుంచి జవాబు వచ్చాక పార్టీలో అధికారికంగా చేరతానని అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా తన గ్రాఫ్ బాగాలేదని జగన్ అన్నారని మండిపడ్డారు.

‘నేను తప్ప ఉదయగిరిలో ఎవరూ గెలవలేరు. చంద్రబాబు టీడీపీ నుంచి టికెట్ ఇస్తే మరోసారి గెలుస్తా. టికెట్ ఇవ్వకపోయినా ఇక నా ప్రయాణం టీడీపీతోనే. రాష్ట్రంలో ధర్మం, న్యాయం లేవని ప్రజలకు అర్థం అయింద’ని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని విమర్శలు గుప్పించారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకు వైసీపీ అధిష్ఠానం ఎమ్మెల్యేలు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ వార్తపై స్పందించిన మేకపాటి.. తనను సస్పెండ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నానని, రిలాక్స్ గా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. పార్టీలో మంచి చేసిన వారికి కూడా కొందరు చెడు చేస్తున్నారని, అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారిందని విమర్శించారు.

Tags:    

Similar News