Phone Ban : ఫోన్‌తో స్కూల్‌కి వెళితే ఇక అంతే
ఇంట్లో ఎంత మంది ఉంటే..అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. స్కూల్‌కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఈజీగా మొబైల్ ఫోన్లను ఆపరేట్ చేస్తున్నారు. ఒక్కరోజు చేతిలో ఫోన్ లేకపోతే అదేదో ప్రపంచమే ఆగిపోయినంతంగా పీల్ అవుతున్నారు. ఈ ధోరణి బడికి వెళ్లే పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. పిల్లలు తమతో పాటే ఫోన్లను బ్యాగులో పెట్టుకుని తీసుకెళ్లి ఫ్రీ టైంలో చూసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం ఈ మధ్యనే కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్‌లో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం విద్యార్థులే కాదు టీచర్లు కూడా మొబైల్ ఫోన్ల వినియోగంపై ఢీల్లీ సర్కార్ బ్యాన్ విధించింది.
తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఇదే ప్లాన్‌ను వర్కౌట్ చేస్తోంది. పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధాన్ని విధిస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు స్కూల్‌కు మొబైల్స్ తీసుకురావడంపై బ్యాన్ విధించింది. టీచర్లు కూడా క్లాసులు జరిగే సమయంలో క్లాస్ రూమ్స్‌లోకి ఫోన్లు తీసుకురావడంపై ఆంక్షలు విధించింది. స్కూల్‌కు రాగానే టీచర్లు వారి వారి మొబైల్ ఫోన్లను స్కూల్ ప్రిన్సిపల్‌కు అప్పగించాలని ఉత్తర్వుల్లో సూచించింది.
చదువుకునేందుకు బడికి వచ్చే చిన్నారులు మొబైల్స్ కారణంగా డైవర్ట్ కాకుండా వారికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాల, ఇతర వర్గాలతో పూర్తిస్థాయిలో డిస్కస్ చేసిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఒకవేళ ఏ విద్యార్థి అయినా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు తల్లిదండ్రులు వారి పిల్లలకు మొబైల్ ఫోన్లను ఇవ్వకూడదని తెలిపింది.