ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఓ వైపు జంపింగ్ రాయుళ్లు తమ ప్లాన్ ప్రకారం వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు సీనియర్ నేతలు తమ పిల్లలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఏలూరు జిల్లా రాజకీయాలు కూడా మరింత ఆసక్తికరంగా మారాయి. ఏలూరు టీడీపీ మాజీ ఎంపీ అయిన మాగంటి బాబు నివాసానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మ నాభం వెళ్లారు.
ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ
ముద్రగడ పద్మనాభం మాగంటి బాబు ఇంటికి వెళ్లడంపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు. వీరి సమావేశంపై ఏలూరులోని టీడీపీ, జనసేన నేతల్లో రాజకీయ చర్చ మొదలైంది. ముద్రగడ పద్మనాభంతో భేటీకి సంబంధించి మాగంటి బాబు మాట్లాడుతూ..తనకు ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ ఫ్రెండ్ అని అన్నారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని, తామిద్దరం కాంగ్రెస్‌లో పనిచేశామన్నారు.
పవన్‌ని కలుస్తానన్న ముద్రగడ
కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి పనిచేసిన తర్వాత టీడీపీలోకి వెళ్లామన్నారు. కొన్ని పదవుల్లో పనిచేశామని అన్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి ఆ రెండు పార్టీల్లో ఎందులోకి వచ్చినా పర్వాలేదని తాను ముద్రగడకు చెప్పానన్నారు. అయితే త్వరలోనే ముద్రగడ పవన్ కళ్యాణ్‌ని కలుస్తానని చెప్పారట. ఆ తర్వాత జనసేనలో చేరుతానని కూడా ఆయన చెప్పినట్లు మాగంటి బాబు తెలిపారు.
జనసేనలోనే ఉండనున్నారా?
టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తామిద్దరం కలిసి పనిచేస్తామని మాగంటి బాబు అన్నారు. వైసీపీ తనను మోసం చేసిందని, రాజ్యసభ సీటు ఇస్తామని అన్నారని, అయితే తనలాంటి వాళ్ల వద్ద వందల కోట్లు ఎక్కడుంటాయని ముద్రగడ చెప్పినట్లు అన్నారు. తనకు గతంలో ఓ గాయం అయ్యిందని, ఆ గాయం మానేంత వరకూ జనసేనలోనే ఉంటానని ముద్రగడ చెప్పినట్లుగా మాగంటి బాబు తెలిపారు. వీరిద్దరి భేటీతో ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ నెలకొంది.