ఉదయ్ కిరణ్ చావుకు పవన్ కారణం..వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
హీరో ఉదయ్ కిరణ్ చనిపోవడానికి పవన్ కళ్యాణే కారణం అంటూ వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్‌కు సినిమా అవకాశాలు రాకుండా చేసి మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపణలు చేశారు. బాబు, పవన్ ఇద్దరూ జగన్ నామాన్ని జపిస్తున్నారని, ప్రజలకు పనికొచ్చే పనులు చేయడం లేదని విమర్శించారు. పవన్ జీవితంలో ఏనాడూ ఎమ్మెల్యే కూడా కాలేడన్నారు. సీఎం జగన్ పేరు చెబితేనే పవన్, చంద్రబాబుకు భయం పట్టుకుంటోందన్నారు.
ప్రతి సభలో పవన్ 200 సార్లు జగన్ పేరును ప్రస్తావిస్తారని, పావలా బిళ్ల కింద పడితే గోల చేస్తారని ఎద్దేవా చేశారు. ఎవరి సలహాలు వద్దని అనుకోవడం వల్లే పవన్ ఆఖరికి బాబు మాటలు వింటూ ఆయన పక్కన చేరారన్నారు. పవన్‌తో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత ముందుకు రావడం లేదన్నారు.
అటు ఎమ్మెల్యే కాలేక, ఇటు సినిమా ఆఫర్లు లేక పవన్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారన్నారు. టీడీపీ జెండాను చేతబట్టి పవన్ తన ఉనికిని కోల్పోతున్నారన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు వెనుక చంద్రబాబు ఉన్న సంగతి పవన్‌కు తెలుసన్నారు. చంద్రబాబు పక్కన చేరి పవన్ కాపులకు కూడా అన్యాయం చేస్తున్నారన్నారు. సీట్ల పంపకాలు చూసైనా పవన్ మారుతాడని అనుకుంటే, ఎటువంటి మార్పు లేకపోవడమే కాకుండా టీడీపీ జెండాను మోస్తూ బాబుకు బానిస అయ్యారని ఎద్దేవా చేశారు.