చంద్రబాబు అరెస్ట్.. దుర్గమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి
టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్పై ఆయన సతీమని నారా భువనేశ్వరి స్పందించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మను ఆమె దర్శించుకున్నారు. తన భర్తకు మనోధైర్యం ఇవ్వాలని దుర్గమ్మను వేడుకున్నట్లు చెప్పారు. ‘‘చంద్రబాబు రాష్ట్ర ప్రజల బాగు కోసం పోరాటం చేస్తున్నారు. ఎవరికైనా మనసు బాగాలేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తారు. అందుకే నా బాధ చెప్పుకోవడానికి అమ్మవారి దగ్గరకు వచ్చా. అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమవ్వాలి’’ అని భువనేశ్వరి అన్నారు.
అటు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్థరాత్రి అరెస్టు చేశారని పవన్ మండిపడ్డారు. 2022 అక్టోబర్‌లో వైజాగ్ లో తమ పట్ల కూడా అలాగే ప్రవర్తించారనీ, ఏ తప్పూ చెయ్యని తమ కార్యకర్తల్ని అరెస్టు చేశారని వాపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా జగన్ సర్కారు వ్యవహరిస్తోంది పవన్ విమర్శించారు.