రాజమండ్రి జైలులో చంద్రబాబు భద్రతపై ఆయన సతీమణి భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జమండ్రి సెంట్రల్ జైల్లో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవని.. బాబు భద్రత పట్ల అనుమానాలున్నాయని చెప్పారు. చంద్రబాబు కట్టిన జైల్లోనే ఆయన్ని కట్టిపడేశారని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబును లోకేష్, బ్రాహ్మిణితో కలిసి భువనేశ్వరి కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు బాబుతో ములాఖత్ అయ్యారు.
కుటుంబం కంటే చంద్రబాబుకు ప్రజలే ముఖ్యమని భువనేశ్వరి చెప్పారు. తన జీవితమంతా ప్రజల కోసమే ధారపోశారని అన్నారు. జైల్లో చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసమే మాట్లాడేవారని.. ఆయనపై లేనిపోని కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ‘‘జైలు నంచి త్వరగా బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తానని చంద్రబాబు అన్నారు. ప్రజల హక్కుల కోసమే పోరాటం చేస్తున్నారు. తాను బాగునున్నానని.. ఎవరూ భయపడొద్దని చంద్రబాబు చెప్పారు’’ అని భువనేశ్వరి తెలిపారు.
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు పిటిషన్ తిరస్కరించారు. పిటిషన్పై రెండ్రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు హౌస్ రిమాండ్ కోరుతూ ఆయన తరఫు లాయర్లు చూపిన కారణాలను సీఐడీ తరఫు అడ్వొకేట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. బాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైలులో ఆయనకు పూర్తి స్థాయి భద్రత కల్పించామని అడిషనల్ ఏజీ కోర్టుకు తెలిపారు. సీఐడీ లాయర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు వేసిన పిటిషన్ను తిరస్కరించింది.