ఏపీని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా అని నారా బ్రాహ్మణి ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబును జైలుకు పంపారని ఆరోపించారు. బాబు అరెస్ట్కు నిరసనగా రాజమండ్రిలో నిర్వహించిన కొవొత్తుల ర్యాలీలో భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కక్ష రాజకీయాలు చూస్తుంటే లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానం కలుగుతుందన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు, లోకేశ్‌కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి జగన్ సర్కార్ ఓర్వలేకపోతుందని బ్రాహ్మణి విమర్శించారు. ‘‘చంద్రబాబు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా?. లక్షలాదిమంది యువతకు స్కిల్స్ మెరుగుపర్చి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారు. ఉద్యోగాలు కల్పించడం నేరమా?. ఇప్పుడున్న ప్రభుత్వం గంజాయి, లిక్కర్ ఇచ్చి యువత జీవితాలను నాశనం చేస్తోంది. చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న ప్రజలకు నా ధన్యవాదాలు. న్యాయవ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు’’ అని బ్రాహ్మణి తెలిపారు.
జగన్ ఆరోపణలు..
మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్టై జైల్లో ఉన్న ఒక మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెబుతాను, ఆలోచన చేయాలని ప్రజలను కోరుతున్నాను అని జగన్ అన్నారు. ఎన్ని దొంగ తనాలు, దోపిడీ చేసినా, వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని రక్షించుకొనేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ, చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవాళ్లు ఇంతకాలం లేరంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఒక మామూలు వ్యక్తి తప్పుచేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో.. అధికారంలో ఉన్నవారికికూడా అదే శిక్ష పడాలని చెప్పేవారు ఇంతకాలం లేరని అన్నారు.