Chandrababu Tweet : ప్రజలరా! రండి.. రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం

Byline :  Veerendra Prasad
Update: 2024-01-18 05:26 GMT

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఆయనను స్మరించుకున్నారు. "దేశంలో సంక్షేమపాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.ఒకే ఒక జీవితం... రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది... తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి. బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతలతో తెలుగునేల అల్లాడుతున్న ఈ వేళ... తిరిగి రామరాజ్య స్థాపనకు ఎన్టీఆర్ స్ఫూర్తిగా మనందరం కదలాలి. అందుకే 'తెలుగుదేశం పిలుస్తోంది. రా... కదలిరా!' అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా... నేను 'రా... కదలిరా!' అని పిలుపునిచ్చాను. తెలుగు ప్రజలరా! రండి... ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం. ఎన్టీఆర్ కు అసలైన నివాళి అర్పించుదాం." అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News