వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్. దేశంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోని మాచర్లలో ఆటవిక రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. రెంటచింతల మండలం మల్లవరం తండాలో మంచినీరుని పట్టుకునేందుకు ట్యాంకర్ వద్దకు వచ్చిన గిరిజన మహిళను వైసీపీకి చెందిన ఒక సైకో ట్రాక్టర్ తో తొక్కించి కీరతకంగా చంపడం చాలా దారుణమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.
వారం రోజులుగా చుక్క మంచినీరు లేక రాకరాక వచ్చిన ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను... మీరు టీడీపీ పార్టీకి చెందిన వారని చీదరించుకొడం న్యాయమా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు నీళ్లు పట్టుకోవడానికి వీల్లేదని వైసీపీకి చెందిన సైకో బెదిరించాడని విమర్శించారు. తాగునీటికి, పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే ఆ మహిళ చేసిన నేరమని అన్నారు.
మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలు చూశాక మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా..లేక రాతి యుగంలోనా అని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన వ్యక్తి ఊరంతా చూస్తుండగా 3 సార్లు ట్రాక్టర్ తో తొక్కించి దారుణంగా చంపేశాడని అన్నారు. అయితే డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు కట్టడం పతనమైన పోలీసు వ్యవస్థకు పరాకాష్ట కాదా? అని ప్రశ్నించారు. ఆడమనిషి మంచినీళ్లు అడిగితే దారుణంగా చంపేస్తారా అని నారాలోకేశ్ మండిపడ్డారు.