చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నారా లోకేష్ నిరసన

Byline :  Kiran
Update: 2023-09-09 03:22 GMT

టీడీపీ చీఫ్ చంద్రబాబును అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. అరెస్టును నిరసిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళనకు దిగారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో ఉన్న ఆయన చంద్రబాబును అదుపులోకి తీసుకోనున్నారన్న సమాచారంతో విజయవాడ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు లోకేష్ను అడ్డుకున్నారు. దీంతో రాజోలు సీఐ గోవిందరాజుతో ఆయన వాగ్వాదానికి దిగారు.

పోలీసులు అడ్డుకోవడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తన వెంట నాయకులెవరూ రావడంలేదని, తన తండ్రిని కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకునే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. చంద్రబాబు అరెస్టు, పోలీసుల వైఖరికి నిరసనగా లోకేష్ క్యాంప్ సైట్ వద్ద బైఠాయించారు.

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన లోకేష్ "పిచ్చోడు లండన్‌కి...మంచోడు జైలుకి...ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం అని మండిపడ్డారు. FIRలో పేరు లేకపోయినా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో జగన్ తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదని లోకేష్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు నంద్యాలలో తెల్లవారు జామున 5 గంటల సమయంలో అరెస్టు చేశారు. ఆయనను అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. స్కిల్స్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో బాబును అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Tags:    

Similar News