ఏపీ నిరుద్యోగులకు నారా లోకేశ్ బహిరంగ లేఖ

Update: 2024-02-02 16:27 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీలోని నిరుద్యోగులకు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మోసాలకు నిరుద్యోగులు ఆందోళన చెందన్నారు. ఉన్న ఉద్యోగులను ఎత్తి వేసేందుకు వైసీపీ సర్కారు జీవో 117 తెచ్చిందని ఆరోపించారు. జీవో నెం.117 వల్ల 65 వేల పోస్టులు రద్దయ్యాయని పేర్కోన్నారు. ఉపాధ్యాయులకు అప్రెంటిస్ షిప్ విధానం రద్దు చేసి పూర్తి పేస్కేల్ అమలు చేస్తామని లోకేశ్ తన లేఖలో హామీ ఇచ్చారు."2019 ఎన్నిక‌ల‌కి ముందు అధికారంలోకి రాగానే 23 వేల ఖాళీ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి మెగా డీఎస్సీ తీస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చాడు. న‌మ్మి ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగుల‌కు ఇచ్చిన హామీని జగన్ ఐదేళ్లపాటు మ‌రిచిపోయాడు. దిగిపోయే ముందు 6 వేల పోస్టుల భర్తీకి డిఎస్సీ వేస్తున్నామంటూ జ‌గ‌న్ మ‌రోసారి చేస్తున్న మోసాన్ని గుర్తించండి.

ఎన్టీఆర్, చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వాలు ఇప్ప‌టివ‌ర‌కూ 1,70,000 టీచ‌ర్ పోస్టులు పార‌ద‌ర్శ‌కంగా భ‌ర్తీ చేసిన ఘ‌న‌త దక్కించుకున్నాయి. ఇదే అనుభవంతో టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తాం. కొత్త పోస్టులు భర్తీ చేయకపోగా, ఉన్న పోస్టులు ఎత్తేసేందుకు జగన్ ప్రభుత్వం తెచ్చిన 117 జీవో వల్ల 65 వేల పోస్టులు ర‌ద్ద‌యిపోయాయి. మంత్రి బొత్స ఖాళీగా ఉన్న 8,366 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. చివ‌రికి 6 వేల పోస్టులకు డిఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని ఎల‌క్ష‌న్ డ్రామా మొద‌లుపెట్టారు. ఏపీలో 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్ల‌మెంటులో కేంద్రం వెల్ల‌డించింది. 2013లో ర‌ద్ద‌యిన అప్రెంటిషిప్ విధానాన్ని మ‌ళ్లీ తేవ‌డం జ‌గ‌న్ నాట‌కంలో భాగ‌మే. 2019 ఎన్నిక‌ల ముందు డిఎస్సీ హామీ ఇచ్చాడు, 2024 ఎన్నిక‌లొస్తున్న‌ప్పుడు ఆ హామీని అమ‌లు చేస్తానంటున్న జ‌గ‌న్ మాయ‌మాట‌లు న‌మ్మొద్దు నిరుద్యోగులారా! ఎన్నికల ముందు 23 వేల ఖాళీలు ఉన్నాయ‌న్న జ‌గ‌న్‌, ఎన్నికల తరువాత 18 వేల ఖాళీలే అని మాట మార్చాడని లేఖలో లోకేశ్ పేర్కోన్నారు.


Tags:    

Similar News