Lavu Srikrishna Devarayalu : వైసీపీకి షాక్.. పార్టీకి, ఎంపీ పదవికి లావు శ్రీ కృష్ణదేవరాయలు రాజీనామా
ఏపీలోని నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని, గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో పార్లమెంట్ కు పంపించారని అన్నారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేశానని తెలిపారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం భావించిందని, అందుకు బాధ్యత తనది కాదని శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. కాగా.. ఎంపీని కలిసేందుకు పల్నాడు ఎమ్మెల్యేలు ఆయన నివాసానికి బయల్దేరగా.. ఇంతలోనే ఆయన రాజీనామా ప్రకటన చేశారు. కొద్దిరోజులుగా వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులను మార్చుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చనున్నట్లు వార్తలొచ్చాయి. నర్సరావు పేట నుంచి బీసీ అభ్యర్థిని ఎంపీగా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. 15 రోజులుగా అభ్యర్థి విషయంలో అనిశ్చితి కొనసాగుతుందని, ఆ అనిశ్చితికి తాను బాధ్యుడిని కానంటూ తాజాగా మీడియా సమావేశంలో ఎంపీ అన్నారు. అనిశ్చితి కోరుకున్నది తాను కాదని తెలిపారు. కొత్త అభ్యర్థి వస్తారని అంటున్నారని, దీంతో క్యాడర్ లో కన్ఫ్యూజన్ నెలకొందని అన్నారు.
కాగా వైసీపీ అధిష్ఠానం శ్రీకృష్ణ దేవరాయలకు గుంటూరు నుంచి బరిలోకి దిగాలని సూచించింది. కానీ అందుకు ఆయన ససేమిరా అన్నారు. వైసీపీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగానే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.